గడువులోగా విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగిస్తూ ఆదేశాలు - టర్మినేషన్ ఆర్డర్ల
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 22, 2024, 11:08 AM IST
Temination Orders to Anganwadis: ఇవాళ ఉదయం 10 గంటలలోపు విధుల్లో చేరని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను ఉద్యోగంలో నుంచి తొలగించాలని ప్రభుత్వం. సంబంధిత అదికారులకు ఆదేశించింది. ఈ మేరకు టర్మినేషన్ ఆర్డర్‌లు జారీ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటల లోపు విధుల్లో చేరిన అంగన్వాడీ హెల్పర్‌లకు వర్కర్‌లుగా పదోన్నతులు కల్పించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. పార్వతిపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ టర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేసేందుకు కలెక్టర్లు సిద్ధం చేశారు.
ఇచ్చిన హామీల మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా అందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంగన్వాడీలు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు సేకరించిన కోటి సంతకాల ప్రతులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అంగన్వాడీలు విజయవాడకు బయల్దేరగా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టర్మినేషన్ ఆర్డర్ల ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకువచ్చింది.