వైఎస్సార్సీపీ అరాచకాలపై ఈసీకి అచ్చెన్న లేఖ- ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి - ఎన్నికల భద్రత ఏర్పాట్లపై లేఖ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 10:12 AM IST
TDP State President Achennaidu Letter to SEC about Elections: అధికార పార్టీ అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి(SEC) తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో (Macharla) వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామి రెడ్డి చెప్పినట్టు చేస్తూ అధికార యంత్రాంగం, పోలీసులు వైఎస్సార్సీపీ బంటుల్లా పనిచేస్తున్నారని లేఖలో అచ్చెన్న పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ (YSRCP) నాయకుల ఒత్తిడితో ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని అచ్చెన్న తెలిపారు. 2021లో జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గూండాలు ప్రతిపక్ష అభ్యర్ధుల్ని నామినేషన్లు వేయనీయలేదని అచ్చెన్న ఆరోపించారు. గత ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తల్ని అధికార పార్టీ నేతలు భయాందోళనలకు గురిచేశారని గుర్తు చేశారు. వెల్దుర్తి, రెంటచింతల, కారంపూడి, మాచర్ల మండలాల్లోని పలు గ్రామాల్లో పోలింగ్ బూత్‌లను స్వాధీనం చేసుకుని రిగ్గింగ్‌కు (Rigging) పాల్పడ్డారని, టీడీపీ నాయకులు చంద్రయ్య, జల్లయ్యను హత్య చేశారని అచ్చెన్న స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ(State Election Commissioner)ను అచ్చెన్న కోరారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, గ్రామాల వివరాలను లేఖలో ప్రస్తావించారు. వీటి వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేయాలని ఎస్‌ఈసీను అచ్చెన్న కోరారు.