ఓటమి భయంతో వైఎస్సార్సీపీ నేతలు నాటు బాంబులతో విధ్వంసం చేశారు: యరపతినేని - Srinivasarao Fire on YCP Attack
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 14, 2024, 5:26 PM IST
TDP Leader Yarapatineni Srinivasarao Comments on YCP Attack: సార్వత్రిక ఎన్నికల్లో గెలవలేమని తెలిసి వైఎస్సార్సీపీ నేతలు పోలింగ్ రోజు విధ్వంసం సృష్టించారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు వేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. పోలింగ్ రోజు బాంబులు వేయటం హేయమైన చర్య అని శ్రీనివాసరావు అన్నారు. పోలింగ్ కేంద్రం తలుపులు పగలకొట్టి ఈవీఎంలు తీసుకెళ్లేందుకు యత్నించారని ఆరోపించారు.
పథకం ప్రకారమే తంగెడలో వైఎస్సార్సీపీ మూకలు దాడులకు తెగబడ్డారని యరపతినేని విమర్శలు గుప్పించారు. రాళ్ల వర్షం కురిపించడంతో ఓటర్లు భయాందోళనకు గురై పోలింగ్ కేంద్రం నుంచి పరుగులు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ మూకలు బాంబులతో దాడులు చేశారని శ్రీనివాసరావు ఆరోపించారు. దాడుల్లో ధ్వంసమైన ప్రాంతాలను పరిశీలించిన యరపతినేని దాడుల్లో గాయపడిన బాధితులను పరామర్శించారు. అధికారంలోకి వచ్చాక బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.