కోడికత్తి శ్రీనులా వడ్డెర పిల్లలని బలిచేస్తారా?: టీడీపీ - Varla Ramaiah complained to EC - VARLA RAMAIAH COMPLAINED TO EC
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 20, 2024, 9:25 PM IST
TDP leader Varla Ramaiah complained to EC: రాష్ట్రంలో చాలా జిల్లాలలో శాంతి భద్రతలు అదుపులో లేవని తెలుగుదేశం నేత వర్ల రామయ్య అన్నారు. కడప జిల్లాలో శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్న పరిస్థితి ఉందని అన్నారు. పులివెందులలో ఇద్దరు దంపతులు టీడీపీ ఓటు వేస్తామన్నందుకు వారిపై వైసీపీ వాళ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేశారని, ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. మహిళా అని కూడా చూడకుండా రాళ్లతో కొట్టారని వర్ల రామయ్య ఆరోపించారు.
దాడి చేసిన వీడియో చూసి ఈసీ అధికారులు కూడా ఆశ్చర్యపోయారని వర్ల రామయ్య తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నిందితులపై బెయిల్ వచ్చే కేసులు పెట్టాలని చెప్పారని తెలుస్తోందన్నారు. చంపేస్తున్నా కూడా బెయిల్ వచ్చే కేసులు పెట్టేలా ఉన్నారని అన్నారు. ఆదిమూలం సురేష్ నిన్న నామినేషన్ వేశారని, ఆయన సతీమణి ఐఆర్ఎస్ అధికారి అయిఉండి కూడా నామినేషన్ లో పాల్గొన్నారన్నారు. ఆమె ఎలా రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటారని ప్రశ్నించారు. ఆమెని వెంటనే సస్పెండ్ చేయాలని ఈసీని కోరానని తెలిపారు. గులక రాయితో ఎలా చంపుతారు, కేవలం ఓడిపోతారనే వైసీపీ నేత వెల్లంపల్లి టీడీపీ నేత బోండా ఉమాపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికీ ఐదుగురు వడ్డెర పిల్లలు పోలీసు కస్టడీలో ఉన్నారని అన్నారు. కోడికత్తి కేసులో శ్రీనులా వడ్డెర పిల్లలని బలిచేస్తారా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.