వాలంటీర్లకు వైసీపీ నేతలు ప్రలోభాలు - ఎన్నికల సంఘానికి షరీఫ్ ఫిర్యాదు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 12:38 PM IST
TDP Leader Shariff Letter to SEC About Gifts to Volunteers : మార్కాపురం నియోజకవర్గంలో వాలంటీర్లకు స్వీటు బాక్సులు, నగదు పంచిన గిద్దలూరు ఎమ్మెల్యే (Giddalur MLA) అన్నారాంబాబుపై చర్యలు తీసుకోవాలని శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ ఎన్నికల సంఘానికి (SEC) ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో వాలంటీర్లకు స్వీటు బాక్సులు, రూ. 5 వేలు పంచడంపై షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికల్లో మార్కాపురం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా అన్నా రాంబాబు పోటీ చేయనుండటంతో ప్రలోభాలకు తెర లేపారని ఫిర్యాదులో షరీఫ్ పేర్కొన్నారు. ఒక్కో వాలంటీర్ పరిధిలోని ఉన్న 50 కుటుంబాలను ప్రభావితం చేయాలని వాలంటీర్లకు రాంబాబు నిర్ధేశించారని షరీఫ్ తెలిపారు. ఎన్నికలకు ముందు స్వీట్లు, డబ్బులు పంచడం ఎన్నికల నియమావళికి విరుద్దమని, దీనిపై విచారణ జరిపి రాంబాబుపై చర్యలు తీసుకొని అనర్హత వేటు వేయాలని షరీఫ్ కోరారు. రాజకీయ పార్టీ సమావేశానికి హాజరైన వాలంటీర్లపై చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలకు హాజరు కాకుండా ఆదేశించాలని షరీఫ్ లేఖలో కోరారు.