వైఎస్సార్సీపీ సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించింది: రోషన్ కుమార్ - Chintalapudi charge Roshan Kumar
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 8:16 PM IST
TDP leader Roshan Kumar: ఏలూరు జిల్లా చింతలపూడి తెలుగుదేశం పార్టీ నూతన బాధ్యుడిగా సొంగ రోషన్ కుమార్ను నియమించిన నేపథ్యంలో ఆయన గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోషన్ కుమార్కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ బాధ్యుడిగా నియమించినందుకు, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు రోషన్ ధన్యవాదాలు తెలిపారు. అందరి సమిష్టి కృషితోనే తనను చంద్రబాబు చింతలపూడి ఇంచార్జిగా నియమించారని తెలిపారు. తనకు ఎలాంటి అధికారం లేకపోయినా గత కొంతకాలంగా ప్రజలకు సేవ చేస్తున్నట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత నియోజకవర్గ సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తానని సొంగ రోషన్ కుమార్ హామీ ఇచ్చారు.
ప్రధానంగా చింతలపూడి నియోజకవర్గంలో నాలుగు మండలాల రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారయ్యాయని రోషన్ ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు. తెలగుదేశం అధికారంలోకి వస్తే సంక్షేమంతోపాటుగా అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం- జనసేన నేతలు, కార్యకర్తల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుందని రోషన్ తెలిపారు.