గిరిజన సంక్షేమ హాస్టల్లో మరో విద్యార్థి మృతి - గత మూడేళ్లలో 40మంది మృత్యువాత - student died in Tribal Hostel
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 11, 2024, 7:24 PM IST
Student Died in Tribal Hostel of Alluri District : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. ఇదే హాస్టల్లో గత ముడేళ్లలో 40 మంది అనారోగ్యంతో చనిపోయారు. తాజాగా ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి మరణించింది. వివరాల్లోకి వేళ్తే జిల్లాలోని మాడుగులలోని గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్లో కృష్ణవేణి అనే విద్యార్థిని ఎనిమిదో తరగతి చదువుతుంది. నిన్న (బుధవారం) రాత్రి బాలిక భోజనం చేసి తోటి స్నేహితులతో పాటు పడుకుంది. ఈరోజు ఉదయం విద్యార్థులందరూ లేచినా కృష్ణవేణి మాత్రం లేవలేదు. కంగారుపడ్డ స్నేహితులు కృష్ణవేణిని లేపేందుకు ఎంత ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
దీంతో భయందోళనకు గురైన విద్యార్థులు పాఠశాల సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న కుమార్తెను చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. విద్యార్థిని మరణానికి పాఠశాల సిబ్బందే కారణమని కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. పాఠశాలలో సక్రమంగా మెనూ అమలు చేయకపోగా, పోషకాహారం లేని భోజనంతో విద్యార్థులు అనారోగ్యంతో మరణిస్తున్నారని తెలిపారు.