పరిశ్రమల కోసం ఇచ్చిన భూములు తిరిగివ్వాలంటూ రైతుల నిరసన - Farmers Protest for Lands
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 9, 2024, 5:08 PM IST
Farmers Protest for Lands: పరిశ్రమల కోసం ఇచ్చిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని ఎమ్మార్వో కార్యాలయం వద్ద రైతులు నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో పరిశ్రమల కోసం ఇచ్చిన భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని రైతులు, రాష్ట్ర రైతు సంఘం నాయకులు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కార్యాలయం ముందు మోకాళ్లపై కూర్చుని నినాదాలతో ఆందోళన నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందించారు.
అనంతరం రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ, మడకశిర మండలంలో పరిశ్రమల కోసం 2004వ సంవత్సరంలో రైతుల నుంచి ఎస్ఈజెడ్ (Special Economic Zone) వారు 2200 ఎకరాలు భూమిని సేకరించారని తెలిపారు. 20 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పలేదన్నారు. జగన్ ప్రభుత్వము గత ఐదు సంవత్సరాలు పట్టించుకోలేదని, చాలామంది రైతులు వారి భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తమ భూముల పట్టాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు.