పట్టించుకోని అధికారులు - ఎంపీడీవో కార్యాలయం ఎదుట మురుగు పోసేందుకు గ్రామస్థుల యత్నం - ఎంపీడీవో ఆఫీస్ ముందు మురుగు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 13, 2024, 10:40 PM IST
Sewage Waste Dump at MPDO Office: కాలువలు శుభ్రం చేసి ఆ మురుగును నేరుగా ఎంపీడీవో కార్యాలయం ముందు పోయడానికి ఓ ఊరి గ్రామస్థులు సిద్దమయ్యారు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రాష్ట్ర ఓబీసీ ఫోరం అధ్యర్యంలో ఈ చర్యకు పూనుకున్నారు. కాలువలోని మురుగును ట్రాక్టర్లలో నింపుకుని ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకోగానే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
తిరుపతి జిల్లా చంద్రగిరి వెంకటంపేట గ్రామంలోని మురుగు కాలువ వ్యర్థాలను, రెండు ట్రాక్టర్లలో నింపి మండల పరిషత్ కార్యాలయం ముందు డంప్ చేయడానికి గ్రామస్థులు ప్రయత్నించారు. గ్రామంలోని మురుగునీటి కాలువలు పరిశుభ్రంగా లేనందున ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ గ్రామస్థులతో కలిసి ఈ చర్యకు పూనుకున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. ట్రాక్టర్లలోని మురుగును ఎంపీడీవో కార్యాలయం ఎదుట పోసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సుధా యాదవ్కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఏళ్ల తరబడి మురుగునీటి కాలువలు శుభ్రం చేయకపోవడంతో తాగునీరు కలుషితమైందని బడి సుధా యాదవ్ అన్నారు. ఆ నీటిని తాగుతున్న గ్రామస్థులు అనేక రోగాల బారిన పడుతున్నారని, కిడ్నీ సంబంధిత వ్యాధులు సైతం వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో కొంతమంది గ్రామస్థులు డయాలసిస్ కూడా చేసుకుంటున్నారన్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా కనీసం బ్లీచింగ్ కూడా చల్లడం లేదని దుయ్యబట్టారు. గ్రామస్థుల బాధను అధికారులకు వివరించేందుకే ఈ చర్యకు పూనుకున్నట్లు ఆయన వివరించారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.