నిధుల కోసం సర్పంచుల ఛలో అసెంబ్లీ- పలువురిని గృహ నిర్బంధం - సర్పంచ్ల చలో అసెంబ్లీ కార్యక్రమం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 9:22 AM IST
Sarpanch Chalo Assembly Program Was Obstructed by Police: రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన ఆర్థిక సంఘ నిధులను పంచాయతీలకు తిరిగి ఇవ్వాలని కోరుతూ ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి 2 రోజులు ముందు నుంచే సర్పంచులను, సంఘ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీ రాజేంద్రప్రసాద్‌ను తన స్వగృహంలో అరెస్టు చేయగా సోమవారం తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం తాడిపర్రులో రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యదర్శి కరుటూరి నరేంద్రబాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మా నిధులు మాకివ్వమని అడిగితే పోలీసులతో నిర్బంధిస్తారా? అని కరుటూరి నరేంద్రబాబు మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పంచాయతీలకు నేరుగా ఇస్తే తాము ప్రజలకు మేలు చేసే వీలుంటుందని నరేంద్రబాబు తెలిపారు. సర్పంచుల ఉద్యమాన్ని అడ్డుకోవడాన్ని ఆయన ఖండించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత నిధుల కోసం సర్పంచ్లు వివిధ రూపాల్లో పోరాటాలు సాగిస్తూ వస్తున్నామన్నారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్ల సంఘం పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. పోలీసులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేయడంపై నరేంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.