తాగునీటి పైప్‌లైన్ తోటకు మళ్లించుకున్న ఎమ్మెల్యే- అడ్డుకున్నఅధికారులపై అనుచరుల వీరంగం - Puttaparthi MLA Sridhar Reddy - PUTTAPARTHI MLA SRIDHAR REDDY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 12:18 PM IST
Puttaparthi MLA Accused Stealing water in Satyasai district : తోటకు ఏర్పాటు చేసిన పైపులైన్‌ను తీసేస్తావా ఎంత ధైర్యం మీకు అంటూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అధికారులపై రెచ్చిపోయారు. ప్రజల దాహార్తిని తీర్చే సత్యసాయి తాగునీటి పథకం పైపులైన్‌ను ఎమ్మెల్యే తన తోటకు మళ్లించిన ఉదంతంపై సోమవారం ఈనాడులో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నల్లమాడ మండలం నల్లసింగయ్యగారిపల్లిలోని ఎమ్మెల్యే తోట వద్దకు వెళ్లి పరిశీలించారు. తాగునీటి పథకం ప్రధాన పైపులైన్ నుంచి ఎమ్మెల్యే తోటకు పైపులైన్‌ను అక్రమంగా వేసినట్లు అధికారులు గుర్తించారు.
పైపులైన్‌ను తొలగించేందుకు అధికారులు సిద్ధం కాగా, ఎమ్మెల్యే అక్కడికి తన అనుచరులను పంపించి వీరంగం సృష్టించారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారితో ఫోన్‌లో మాట్లాడుతూ బూతులు తిట్టారు. పైపులైన్‌ను తొలగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారు. తాగునీటిని తోటకు వాడుకునేందుకు అప్పటి కలెక్టరే అనుమతి ఇచ్చారంటూ బుకాయించారు. అయినా అధికారులు వెల్డింగ్ చేసి, పైప్‌లైన్‌ను తీసేశారు. అయితే, నాలుగున్నరేళ్లుగా సాగుతున్న నీటిచౌర్యంపై అధికారులు కేసు పెట్టలేదు. నీటి మళ్లింపులో కొందరు ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారిపైనా ఎలాంటి విచారణకు ఆదేశించలేదు.