గుంటూరు పానీపూరీ వాలాకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం- కారణం ఏమిటో తెలుసా? - President droupadi murmu Invitation - PRESIDENT DROUPADI MURMU INVITATION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 6, 2024, 4:40 PM IST
President murmu Invitation to Pani Puri Wala: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ చిరు వ్యాపారి దిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. తెనాలిలోని బాలాజీరావు పేటకు చెందిన చిరంజీవి పానీ పూరీ బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఆహ్వాన పత్రికను పోస్టల్ సిబ్బంది ఆయనకు అందజేశారు.
జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద తెనాలి పురపాలక పట్టణ పేదరిక నిర్మూలన విభాగం ద్వారా ఆయన రుణం పొందారు. 2021లో రూ.10 వేలు, 2022లో రూ.20 వేలు, 2023లో రూ. 50 వేల చొప్పున తీసుకున్న రుణాల్ని సకాలంలో చెల్లించారు. అది కూడా డిజిటల్ రూపంలో నగదు లావాదేవీలు నిర్వహించటంతో, చిరంజీవికి ఈ ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, మెప్మా (MISSION FOR ELIMINATION OF POVERTY IN MUNICIPAL AREAS) సహకారం వల్ల అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం తప్పిందని చిరంజీవి అన్నారు.