అందరితో మాట్లాడి రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా : వసంత - మైలవరం ఎమ్మెల్యే
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2024, 7:19 PM IST
Mylavaram MLA Vasantha Venkata Krishna: నియోజకవర్గ కార్యకర్తలతో సోమవారం రోజున సమావేశమైన అనంతరం తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని మైలవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. ఆదివారం నియోజకవర్గ, మండలస్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. సోమవారం కార్యకర్తల సమావేశాన్ని ఐతవరం గ్రామంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మీడియా సమావేశం నిర్వహిస్తామన్నారు.
వైఎస్సార్సీపీ ఇప్పటి వరకు ప్రకటించిన ఏ ఒక్క జాబితాలోనూ, ప్రస్తుతం మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రతినిథ్యం వహిస్తున్న వసంత వెంకట కృష్ణప్రసాద్ పేరు ప్రకటించలేదు. అంతేకాకుండా మైలవరం నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ తరపున ఇంచార్జీగా తిరుపతిరావును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాకుండా నందిగామ జనసేన సమన్వయకర్త ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో మైలవరం ఎమ్మెల్యే ఏ పార్టీలో చేరతారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ మారతారా లేక వైఎస్సార్సీపీలోనే కొనసాగుతారా అనేది తేలాల్సి ఉంది.