వేగంగా ఒంగోలులో విమానాశ్రయానికి అడుగులు - Air Port Constucrion in Ongole - AIR PORT CONSTUCRION IN ONGOLE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 22, 2024, 9:22 PM IST
MLA Damacharla Janardhan Review on Airport Construction in Ongole : ప్రకాశం జిల్లా ఒంగోలులో విమానాశ్రయ నిర్మాణంపై ఎన్టీఏ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో కొత్తగా ఏడు ప్రాంతాల్లో విమానాశ్రయాలు నిర్మించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఒక ఎయిర్ పోర్టు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఒంగోలులో ఎయిర్ పోర్టు నిర్మాణంపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, అధికారులతో సమీక్షించారు. విమానాశ్రయం నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణపై అధికారులతో చర్చించారు.
ఒంగోలు సమీపంలో విమానాశ్రయం నిర్మిస్తాం : గతంలో ఒంగోలులో విమానాశ్రయం నిర్మాణం కోసం సేకరించిన 630 ఎకరాల భూమితో పాటు మరో 112 ఎకరాల భూమి సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎంపీ, ఎమ్మెల్యే సూచించారు. రాబోయే ఐదు సంవత్సరాల్లోనే ఒంగోలు సమీపంలో విమానాశ్రయం నిర్మిస్తామని దామచర్ల జనార్థన్ తెలిపారు. విమానాశ్రయం పనులు వేగంగా చేయాలని అధికారులకు సూచించారు.