గుంటూరు జిల్లాలో గాల్లోకి లేచిన రైలు బోగీ - అసలు విషయం ఏమిటంటే! - MOCK DRILL AT RAILWAY STATION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 9, 2024, 4:02 PM IST
VEJENDLA RAILWAY STATION : రైలు ప్రమాదాల్లో ప్రయాణికులను త్వరితగతిన కాపాడేందుకు చేపట్టవలసిన చర్యలపై గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల రైల్వే స్టేషన్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. రెండు రైళ్లు ఢీకొన్న సంఘటనలో బోగీ పై బోగీని ఏర్పాటు చేయడం, అందులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను రక్షించటం, గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్ ద్వారా సమీప వైద్యశాలకు తరలించడం, హెల్ప్ డెస్క్ ప్రమాదంలో నుంచి ప్రయాణికులను రక్షించే విధానంపై మాక్ డ్రిల్ నిర్వహించారు.
సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలనే ధ్యేయం: సౌత్ సెంట్రల్ జోన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రమణారెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే కృషి చేస్తుందని ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులను రక్షించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ మాక్ డ్రిల్ ను నిర్వహిస్తున్నామన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో స్థానికంగా ఉన్న పోలీసులు ఎస్డీఆర్ఎఫ్, ఎన్. డి. ఆర్. ఎఫ్. బృందాలు, వైద్య సిబ్బంది సహకారం తీసుకుని చేపట్టే చర్యలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా గుంటూరు డిఆర్ఎం రామకృష్ణ మాట్లాడుతూ మాక్ డ్రిల్ ప్రకారం అన్నీ నోట్ చేసుకుంటున్నామని ఎక్కడైనా ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకుంటున్నట్లు తెలిపారు.