ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం నిర్వాకం- రోడ్డును తవ్వి నిర్మాణం చేపట్టడంపై దగ్గుపాటి ఆగ్రహం - MLA Daggupati Prasad - MLA DAGGUPATI PRASAD
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 14, 2024, 9:37 AM IST
MLA Daggupati Prasad Inspected illegal Construction in Anantapur District : అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. స్థానిక శ్రీనగర్ కాలనీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహకులు రోడ్డును తవ్వి మురుగు కాలువ నిర్మాణం చేపట్టారు. స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో అధికారులతో కలిసి పరిశీలించారు. అనుమతులు లేకుండా అక్రమాలు జరుపుతున్న వాటిని ఎలా ప్రోత్సహిస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు దగ్గుపాటి ప్రసాద్ ఆదేశించారు.
టౌన్‌ప్లానింగ్, మున్సిపాలిటీ అనుమతులు లేకుండా ఓ ప్రైవేట్ ఆసుపత్రి రోడ్డును తవ్వి మురుగు కాలువలను నిర్మించుకుంటున్నారని దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ విషయంపై స్థానికులు శనివారం అర్ధరాత్రి ఫోన్ కాల్ ద్వారా ఫిర్యాదు చేశారని తెలిపారు. అక్రమంగా నిర్మిస్తున్న మురుగు కాలువకు పూర్తిగా టౌన్ ప్లానింగ్, మున్సిపాలీటీ, ఈఈ అధికారులు బాధ్యత వహించాలని తెలిపారు. నగరంలో కొంత మంది ప్రైవేటు వ్యక్తులు తమ స్వార్థం కోసం అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని వ్యాఖ్యానించారు.