రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష - Ramoji Rao Memorial Program - RAMOJI RAO MEMORIAL PROGRAM
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 25, 2024, 8:06 PM IST
Review On Ramoji Rao Memorial Program: ప్రభుత్వం అధికారికంగా ఈ నెల 27న కృష్ణా జిల్లా కానూరు వద్ద నిర్వహించే రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు సంస్మరణ సభ నిర్వహణపై సచివాలయంలో మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. సచివాలయం 3 బ్లాక్‌లో సమీక్షకు మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణపై మంత్రుల కమిటీ చర్చించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, రామోజీ రావు కుటుంబ సభ్యులు ఫిలిం ఇండస్ట్రీ, కేంద్ర సమాచార శాఖ మంత్రి, ఎడిటర్స్ గిల్డ్ , ప్రముఖ జర్నలిస్టు లు సహా 7 వేల మంది ప్రత్యేక ఆహ్వానితులను ఆహ్వానించాలని నిర్ణయించారు.
ఇప్పటికే రామోజీ రావు సంస్మరణ కార్యక్రమం ఏర్పాట్లను ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్ పరిశీలించారు. వేదిక వద్ద రామోజీరావు చిత్రపటం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి, అతిథులు పుష్పాంజలి ఘటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. డిజిటల్ స్క్రీన్‌తో పాటు రామోజీరావు చిత్రపటం, యానిమేషన్‌లో పుష్పాంజలి విజువల్స్ ప్రదర్శించాలని చెప్పారు. రామోజీరావు జీవిత విశేషాలు, పత్రికారంగానికి చేసిన సేవలపై ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్, షార్ట్ ఫిలిం ప్రదర్శన, సీఎం చంద్రబాబు ప్రధాన వేదిక వద్దకు చేరుకునేలోగా పలు సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.