పరిశ్రమలను రాష్ట్రానికి తెస్తున్నాం - 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతాం: నారా లోకేశ్ - LOKESH INAUGURATED KIA SHOWROOM
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 11, 2024, 3:47 PM IST
Nara Lokesh Inaugurated KIA Cars Showroom: టీసీఎస్ని ఒప్పించి ప్రభుత్వం ఏర్పడిన 120 రోజుల్లోనే పెట్టుబడులు పెట్టేలా చేయటంతో సంతృప్తి చెందట్లేదని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. భారత దేశంలో ఎక్కడ కియా కారు కనిపించినా మేడ్ ఇన్ ఆంధ్రా కారు అని గర్వంగా చెప్పుకుంటున్నామన్న ఆయన, పంటలు పండించలేని ప్రాంతంలో కార్లు పరిగెత్తించిన ఘనత చంద్రబాబుదని గుర్తు చేశారు.
కియా వల్ల ఒక్క అనంతపురం జిల్లాలోనే తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలిపారు. విజన్ ఉన్న నాయకుడికి, విజన్ లేని నాయకుడికి మధ్య తేడా ప్రజలు గుర్తించాలని లోకేశ్ ఆకాంక్షించారు. 2014-19 మధ్య 8 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని గత ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా చెప్పిందన్నారు. పెద్ద పరిశ్రమలను ఒప్పించి రాష్ట్రానికి తెస్తూనే, చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్నారు. మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండలో నూతన కియా కార్ల షోరూంను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. రోజుకు 70 కార్ల సర్వీస్ చేసేలా ఆధునిక వసతులతో షోరూం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మంత్రులు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, కొలుసు పార్థసారథి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.