ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: రాష్ట్రంలో వాట్సప్ గవర్నెన్స్‌ సేవలు ప్రారంభం - ప్రత్యక్షప్రసారం - WHATSAPP GOVERNANCE LAUNCHED LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2025, 12:42 PM IST

Updated : Jan 30, 2025, 1:45 PM IST

AP WhatsApp Governance Launched Live : దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్‌ పరిపాలన (వాట్సప్‌ గవర్నెన్స్‌)కు శ్రీకారం చుట్టనుంది. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలు అందించనుంది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. మంత్రి నారా లోకేశ్‌ గురువారం దీన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్‌ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్‌ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలవుతాయి. వాట్సప్‌ గవర్నెన్స్‌లో భాగంగా ప్రభుత్వ అధికారిక వాట్సప్‌ నంబర్‌ను ప్రకటిస్తారు. ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్‌ ట్యాగ్‌ (టిక్‌ మార్క్‌) ఉంటుంది. ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని పౌరులకు చేరవేయాలంటే ఈ వాట్సప్‌ ఖాతా ద్వారా సందేశాలు పంపిస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ఈ సమాచారం చేరుతుంది. వరదలు, వర్షాలు, విద్యుత్ సబ్‌స్టేషన్ల మరమ్మతులు, వైద్యారోగ్య, వ్యవసాయ, అత్యవసర, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధి సమాచారం వంటివి అందిస్తారు. ప్రజలు వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే ఈ వాట్సప్‌ నంబర్‌కు మెసేజ్‌ చేస్తే వెంటనే ఒక లింక్‌ వస్తుంది. అందులో పేరు, ఫోన్‌ నంబర్, చిరునామా తదితరాలు పొందుపరిచి, వారి వినతిని టైప్‌ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్‌ నంబరు వస్తుంది. దాని ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంత వరకూ వచ్చింది? ఎవరి వద్ద ఉంది అనేది పౌరులు తెలుసుకోవచ్చు. ఎలాంటి సమస్యనైనా ఇక్కడ విన్నవించొచ్చు. నేడు ఉండవల్లిలో ఏర్పాటు చేసిన వాట్సప్ గవర్నెన్స్ సేవల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.
Last Updated : Jan 30, 2025, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details