వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేతలు - చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: పుత్తా నరసింహారెడ్డి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 2:48 PM IST
Massive Inflows From YCP Change to TDP: సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పలువురు వైసీపీ నేతలు పార్టీని వీడి తెలుగుదేశంలోకి చేరుతున్నారు. టీడీపీ కండువాను కప్పుకోవడంపై కొందరు వైసీపీ నేతలు అసహనానికి గురవుతున్నారు. అదే విధంగా వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కుటుంబాలు భారీగా చేరుతున్నాయి. బుధవారం రాత్రి చెన్నూరు మండలానికి చెందిన 200 కుటుంబాలు వైసీపీను వీడి తెలుగుదేశంలో చేరాయి. తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా వారందరినీ ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పుత్తా నరసింహారెడ్డి పేర్కొన్నారు. తొలుత గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబుపై నమ్మకంతోనే పలు పార్టీల నాయకులు టీడీపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. పేదలందరికీ ఇల్లు కట్టి తాళాలు అందిస్తామన్న వైసీపీ ప్రభుత్వం ఎంత మందికి తాళాలు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే అందరికీ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పుత్తా చైతన్య రెడ్డి, వేల్పుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.