టీడీపీలోకి భారీగా చేరికలు - సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు - Various party leaders joining TDP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 11:51 AM IST
Many Leaders Joined TDP in Presence of Chandrababu Naidu : గత కొన్ని రోజులుగా టీడీపీలోకి వలసలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు ఆ పార్టీలో చేరారు. కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు, ఆదోనికి చెందిన ఏసి శ్రీకాంత్ రెడ్డిలు టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని నేతలు పేర్కొన్నారు.
రాష్ట్రం కోసం, యువత భవిష్యత్ కోసం తెలుగుదేశాన్ని అధికారంలోకి తెచ్చేందుకు తాము కృషి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అయితే రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. భారీ సంఖ్యలో వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ వలసలు పెరుగుతుండటంతో అధికార వైసీపీకి షాక్‌లు తగులుతున్నాయి.