అపరిమిత అధికారాలతో చట్టం దుర్వినియోగం- రఘురామిరెడ్డి లేఖను సవాల్ చేస్తూ లోకేశ్ పిటిషన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 13, 2024, 9:01 AM IST
జLokesh Challenging Petition in Raghurami Reddy Letter: రాష్ట్రంలోని ఏ కార్యాలయానికైనా వెళ్లి ఏకపక్షంగా తనిఖీలు, జప్తులు, వారెంట్ లేకుండా అరెస్టులు, రికార్డుల సీజ్, సమాచార సేకరణ చేసేందుకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేస్తున్న గెజిటెడ్ అధికారులు అందరికీ అపరిమిత అధికారాలు కోరుతూ ప్రభుత్వానికి ఆ విభాగం ఐజీ కొల్లి రఘురామిరెడ్డి రాసిన లేఖను సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఆ లేఖను ఆధారం చేసుకుని ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలను నిలువరించాలని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్ పిటిషన్‌లో కోరారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం నాయకులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసుల్లో ఇరికించాలన్న ఏకైక ఉద్దేశంతో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అక్రమ అధికారాన్ని కట్టబెట్టబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు అనుమతివ్వడం అనేది టీడీపీ నేతల హక్కులను హరించడమేనన్నారు. ఎన్నికలు నిష్పాక్షికంగా జరగకూడదని జగన్ ప్రయత్నిస్తున్నారని దీని కోసం రఘురామిరెడ్డిని వినియోగిస్తున్నారని పిటిషన్‌లో లోకేశ్ పేర్కొన్నారు.
ప్రాసిక్యూషన్, జ్యుడీషియల్ అధికారాలను కల్పించాలని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ కోరడం అనేది అసంబద్ధం అన్నారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణలు జరిపిన తర్వాత నివేదిక మాత్రమే ఇస్తుందని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల విషయంలో ఈ విభాగానికి అపరిమిత అధికారాలు దాఖలు పరచడం అనేది చెల్లదని తెలిపారు. ప్రతివాదులందరూ విధులను దురుద్దేశపూర్వకంగా నిర్వర్తిస్తున్నారని ఈ అంశాలన్నింటిపై లేఖ ఆధారంగా ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలన్నింటినీ అడ్డుకోవాలి అని లోకేశ్ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.