గొంతెండుతున్న వన్యప్రాణులు- దాహార్తి తాళలేక చిరుత మృతి - Leopard Dies of Thirst
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 18, 2024, 7:02 PM IST
Leopard Dies of Thirst, Forest Teams to Probe in Anantapur District : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదుకళ్లు అటవీ ప్రాంతంలో చిరుత మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వారం కిందట అనారోగ్యంతో చిరుత మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు (Forest officials) తెలిపారు. సరైన తాగునీరు లేక దాహంతో మరణించిందని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. వన్యప్రాణులకు తాగునీటి సౌకర్యం లేక మైదాన ప్రాంతంలోకి వచ్చి వ్యవసాయ పొలాల్లో నీళ్లు తాగి పోతున్నాయని రైతులు చెప్తున్నారు. ఇటీవల కరెంటు కొరత కారణంగా బోరు బావుల్లో కూడా నీటి లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు.
చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చి దాహంతో అనారోగ్యానికి గురవుతున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఐదుకల్లు అటవీ ప్రాంతంలో వారం కిందట మృతి చెందిన చిరుతను (Leopard) కళేబరాన్ని గుర్తించామని, పోస్టుమార్టం నిర్వహిస్తే అనారోగ్యానికి గురైనట్లు తెలిసిందని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నాగే నాయక్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మన్యప్రాణులకు తాగునీటి (Drinking Water) సౌకర్యం కల్పిస్తామని అధికారులకు తెలిపారు.