'కడప ఓటరు జాబితాలో 20వేలకు పైగా బోగస్ ఓట్లు - ఖాళీ స్థలం పేరిట 42ఓట్లు' - fake votes in Voter List
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 12:27 PM IST
Kadapa TDP Leaders on Bogus Votes : కడప నియోజకవర్గంలో 20 వేలకు పైగానే బోగస్ ఓట్లు జాబితాలో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ నేత మాధవీరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు. కడప ఆర్కేనగర్లో సర్వే నంబరు 340లో ఉన్న ఖాళీ స్థలాన్ని చూపించి 42 మంది పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చారని, అవన్నీ 203 పోలింగ్ బూతులో ఉన్నాయని మాధవీరెడ్డి ఆధారాలను మీడియాకు చూపించారు. నిరంజన్ నగర్లోని 200 మంది ఓటర్లను శంకరాపురంలో కలిపారని పేర్కొన్నారు. అదే విధంగా 44వ డివిజన్ లో ఏడు పోలింగ్ బూతుల్లో దాదాపు 700 మంది బోగస్ ఓటర్లను చేర్చారని తెలిపారు.
AP Voter List 2024 : తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో కడపలో మాత్రమే 300 మంది వరకు చనిపోయిన వారు ఇంకా ఓటర్లుగా ఉన్నారని తెలుగు దేశం నేతలు ఆధారాలతో సహా విడుదల చేశారు. ఇలా దొంగ ఓట్లను చేర్పించి, డబుల్ ఎంట్రీలతో వైఎస్సార్సీపీ నాయకులు ఎన్నికల్లో గెలవాలని కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. బోగస్ ఓట్లపై జిల్లా అధికారులతో పాటు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని మాధవీరెడ్డి, శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు.