సమస్యలను చూపిస్తే మీడియాపై కేసులు పెట్టడం దారుణం: నాదెండ్ల మనోహర్ - Nadendla Manohar Comment
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 21, 2024, 9:21 AM IST
Janasena Leader Nadendla Manohar Comment Case Registered on Media : విశాఖ బర్మా కాలనీలో బాధితులు చెప్పింది మీడియా చూపిస్తే దానిపై కేసులు పెట్టడాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు. బాధితులు వేదన ప్రసారం చేయడం తప్పెలా అవుతుందని ఆయన ఓ ప్రకటనలో ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులను భయపెట్టే చర్యలు సరికావని ఈ కేసులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని అభిప్రాయపడ్డారు. ధనలక్ష్మి కుటుంబంపై దాడి చేసిందెవరు, కారణాలేంటో పోలీసులు చెప్పాలని ఈ సంఘటనను ఎన్నికల అనంతరం జరిగిన హింసగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
బాధితులెవరైనా, బాధించేది ఎవరైనా దాన్ని నిర్భయంగా ప్రజలకి తెలియచేయడం మీడియా బాధ్యత అని నాదెండ్ల మనోహర్ అన్నారు. వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం అన్ని రకాల వార్తలను, జరుగుతున్న పరిణామాల్ని మీడియా సమాజానికి చేరవేస్తుందని తెలిపారు. మీడియా సంస్థలు, వాటి ప్రతినిధులపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మీడియాకు రాజకీయ రంగు పులిమి, వర్గాలుగా విభజించారని మీడియా నియంత్రణకు జీవో నంబరు 1 తీసుకువచ్చారని ధ్వజమెత్తారు.