99కాదు 9శాతం హామీలే అమలు- సీఎం జగన్ వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమా?: గాదె - Gade Venkateswara Rao Comments
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 5:21 PM IST
Janasena Gade Venkateswara Rao Comments: వైసీపీ మేనిఫెస్టోలోని హామీల్లో 99 శాతం అమలు చేశామని సీఎం జగన్ బూటకపు మాటలు చెబుతున్నారని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. రాప్తాడు వైసీపీ సిద్ధం సభలో జగన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. 99 శాతం హామీలు అమలు చేయలేదని, 9 శాతం మాత్రమే అమలు చేశారని తాము నిరూపిస్తామన్నారు.
బీసీలకు 75వేల కోట్లతో ఉప ప్రణాళిక అమలు చేశారా, ప్రత్యేకహోదా సాధించారా, మద్యపాన నిషేధం అమలు చేశారా, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇవేమీ చేయకుండానే 99 శాతం అమలు చేశామని, వాలంటీర్లంతా ఓట్లేయించాలని చెప్పటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీ, పెళ్లిళ్లపై మాట్లాడితే జనం నమ్మలేదని ఇప్పుడు ఎన్నికల గుర్తుపై మాట్లాడారని అన్నారు. గ్లాసులో టీ తాగినా కడిగి ఇంట్లోనే ఉంచుకుంటారని, ఫ్యాన్ మాత్రం మనుషుల్ని చంపే యంత్రంలా తయారైందని ఎద్దేవా చేశారు. జగన్ రాజకీయ నాయకుడు కాదు, దొంగ వ్యాపారస్తుడని విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించారని మండిపడ్డారు. తల్లి, చెల్లిని రోడ్లపై తిప్పి సానుభూతితో గెలిచారని వ్యాఖ్యానించారు.