ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'గంజాయి రాజధానిగా విశాఖ ప్రతిష్ఠ మసకబారుతోంది- జాతీయ సమస్యగా పరిగణించాలి' - జన జాగరణ సమితి ఫ్లెక్సీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 5:04 PM IST

Jana Jagarana Samiti : గంజాయి రాజధానిగా విశాఖ ప్రతిష్ఠ మసకబారుతోందని కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని విశాఖకు పూర్వవైభవాన్ని తీసుకురావాలని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వాసు కోరారు. ఈ మేరకు విశాఖలో జన జాగరణ సమితి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికులను ఆలోచింపచేసింది. రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని వాసు ఆరోపించారు. 

Prime Minister Modi Flexi in Visakhapatnam : దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటంతో విశాఖలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికులను ఆలోచింప చేసింది. విశాఖలో గంజాయి సమస్య తీవ్రతను ప్రధాని దృష్టికి తీసుకెళ్లడానికి జన జాగరణ సమితి మధురవాడ రిజిస్టార్ కార్యాలయం వద్ద ప్లెక్సీని ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అధిక శాతం యువత ఉన్న మన దేశంలో లక్షలాది మంది గంజాయి మత్తుకు బానిసలై, బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారని, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన యువశక్తి నిర్వీర్యం అవుతుందని వాసు ఆవేదన వ్యక్తం చేశారు.

మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా అందరికీ అందుబాటులో ఉండడం వల్ల స్కూల్ పిల్లల నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు గంజాయికి బానిసలు అవుతున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు విశాఖ ఏజెన్సీతో ముడిపడి ఉంటున్నాయని దేశం మొత్తం 7 లక్షల కేజీలు గంజాయి పట్టుబడితే అందులో 5 లక్షల కేజీలు విశాఖ ఏజెన్సీకి సంబంధించినదని అధికారికంగా నిర్ధారించబడటం శోచనీయమన్నారు. 

దేశంలోనే గంజాయి రాజధానిగా విశాఖ ప్రసిద్ధి కెక్కిన నేపథ్యంలో, గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25% శాతం మాత్రమే విజయవంతమైందన్నారు. ఎందుకంటే అంతర్జాతీయ గంజాయి ముఠాల ఆట కట్టించాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుందని, ఇది ఎన్నికల సమయం కాబట్టి విశాఖ ఏజెన్సీలో గంజాయి సమస్యను జాతీయ సమస్యగా గుర్తించి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి, విశాఖ గంజాయికి రాజధాని అన్న చెడ్డ పేరును దయ చేసి తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి జన జాగరణ సమితి విజ్ఞప్తి చేసింది. 

ABOUT THE AUTHOR

...view details