వైఎస్సార్సీపీకి అడ్డాగా విశ్వవిద్యాలయాలు - కాకినాడ జేఎన్టీయూలో 'జగనన్న కాలేజ్ కెప్టెన్స్' - Jagananna College Captains Programe
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 11:59 AM IST
Jagananna College Captains Programme : వైఎస్సార్సీపీ విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్రంగా మార్చేసింది. కాకినాడ జేఎన్టీయూ సెనెట్ హాల్‌లో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో 'జగనన్న కాలేజ్ కెప్టెన్స్' పేరిట రాజకీయ కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఫొటో ఉన్న టీ షర్టులు విద్యార్థులకు పంచి వారితో 'జై జగన్' అంటూ నినాదాలు చేయించారు. వైఎస్సార్సీపీ ప్రచారం కోసం ముద్రించిన కర పత్రాలు, పుస్తకాలు పంపిణీ చేశారు. జగన్ హయాంలో విద్యార్థులకు జరిగిన మేలు పేరుతో వీడియోలు ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేతలు రాజకీయ ప్రసంగాలు చేసి ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.
YSRCP Politics in JNTU Kakinada : రానున్న ఎన్నికల్లో అన్ని జిల్లాల విద్యార్థులు జగన్ వెంటే ఉన్నారని, మీరు మీ తల్లిదండ్రులు జగన్ను మళ్లీ సీఎంగా చేయాలని వ్యాఖ్యానించడం తీవ్ర చర్చకు దారితీసింది. విశ్వవిద్యాలయాన్ని రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చడంపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఈ కార్యక్రమం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై వర్సిటీ వీసీని వివరమ కోరగా స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేసి హాల్ కావాలని అడగటంతో ఇవ్వడం జరిగిందన్నారు. అందులో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సదస్సు నిర్వహించారని తనకు తెలియదన్నారు. దేశంలోనే ఎంతో పేరెన్నిక గల జేఎన్టీయూకేలో పదో స్నాతకోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ రాజకీయ సభలు నిర్వహించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.