ఫీజు పెంపు - ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన - ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 8:52 PM IST
Idupulapaya IIIT Students Protest: వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఫీజులు చెల్లించే విషయంపై ఈ-3, ఈ-4 విద్యార్థులు ధర్నాకు దిగారు. ఫీజుల పెంపుపై క్యాంపస్ అకాడమిక్ బ్లాక్ ముందు విద్యార్థులు ధర్నా చేశారు. గతంలో మాదిరిగానే ఫీజులు ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ అధికారులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు.
రీయింబర్స్మెంట్ వస్తుంది: విద్యార్థుల ధర్నాపై ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి మాట్లాడారు. 2020 కన్నా ముందు జాయిన్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్ ఎక్కువ ఇస్తుందని తెలిపారు. దీంతో స్కాలర్షిప్ అందే విద్యార్థులకూ నాన్ స్కాలర్షిప్ వారికి తేడా కనిపిస్తుందన్నారు. ఫీజు పెంపు అంశాన్ని వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని కుమారస్వామి వెల్లడించారు. గతంలో జాయిన్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ. 40 వేల ఫీజు ఉండేదని అన్నారు. ప్రస్తుత గవర్నమెంటు రూ. 50 వేల ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుందని తెలిపారు. అందుకే ఫీజును రూ. 50 వేలకు పెంచినట్లు తెలిపారు. నాన్ స్కాలర్షిప్ విద్యార్థులకు రూ 40 వేల ఫీజును మాత్రమే వసూలు చేస్తున్నట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు.