రెండో పెళ్లికి అడ్డుపడిన భార్య - శిరోముండనం చేసిన భర్త
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 10:07 PM IST
husband beheaded wife : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు భర్త శిరోముండనం చేశాడు. ఆపై భార్య జుట్టును చేత్తో పట్టుకుని చూపుతూ హల్‌చల్ చేశాడు. శిరోముండనం చేసిన భార్యను ఊరంతా తిప్పి భర్త అభిరామ్ అమానవీయంగా ప్రవర్తించాడు. భార్య ఆశపై అయిష్టతతోనే ఈ తతంగమంతా నడిపాడని తెలుస్తోంది. మరో పెళ్లికి సిద్ధమైన అభిరామ్, భార్య ఆశ ఊరికి వచ్చి ఆమెపై ఈ దాడికి పాల్పడడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో ఈ దారుణం చోటు చేసుకుంది.
తన భార్యదే తప్పంటూ యువకుడు ఆరోపణలు చేస్తుండగా, రెండో పెళ్లి ఆశించి తనకు అన్యాయం చేస్తున్నారంటూ బాధితురాలు ఆశ వాపోయింది. తన అత్తమామలు సైతం తన భర్తను సపోర్ట్ చేస్తున్నారంటూ రోదించింది. యువతికి శిరోముండనం చేసిన అభిరామ్‌పై స్థానికులు మండిపడ్డారు. ఈ చర్యను తీవ్ర స్థాయిలో ఖండించారు. ఈ అమానవీయ ఘటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిరామ్ యథేచ్ఛగా ఇంట్లోకి ప్రవేశించి ఆశపై ఈ దారుణానికి పాల్పడడం గమనార్హం.