పెద్దిరెడ్డి ఇంటి వద్ద గేట్లు తెరిచే ఉంచాలి - హైకోర్టు ఆదేశం - HC on gates at peddireddy house - HC ON GATES AT PEDDIREDDY HOUSE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 25, 2024, 6:48 AM IST
HC on Gates at Peddireddy House: తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముందు రోడ్డుకు అడ్డంగా పెట్టిన గేట్లు తెరిచి ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ గేట్లను మూసివేయవద్దని పేర్కొంది. పెద్దిరెడ్డి ఆస్తికి భద్రతాపరమైన సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు రక్షణ నిమిత్తం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆ దరఖాస్తుపై నిబంధనల మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పెద్దిరెడ్డి స్థలంలో నిర్మాణాలపై బలవంతపు చర్యలొద్దంటూ ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వులను 10వ తేదీన సవరించింది. ఈ ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
తిరుపతిలోని మారుతీనగర్ నుంచి రాయల్‌నగర్ ప్రధాన రహదారికి వెళ్లేందుకు ఉన్న రహదారికి ఇరువైపులా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గేట్లు ఏర్పాటు చేసుకుని ప్రజలను ఆ మార్గం ద్వారా రానివ్వకుండా అడ్డుకుంటూ వచ్చారు. దీనిపై జనసేన నేత కిరణ్‌రాయల్‌తోపాటు పలువురు కార్యకర్తలు, ప్రజలు ఆ గేట్లను తొలగించాలని కోరుతూ పెద్దిరెడ్డి ఇంటి ముందు ఆందోళన చేశారు. ఈ సమయంలో తగిన చర్యలు తీసుకునేందుకు తమకు 48 గంటల వ్యవధి ఇవ్వాలని నాడు కార్పొరేషన్ అధికారులు కోరారు. దీన్ని ఆసరాగా చేసుకుని తమ ఇంటి గేట్లను తొలగించడంతోపాటు సిమెంటు రహదారిని కార్పొరేషన్ అధికారులు తొలగించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.