విజయనగరంలో సందడి చేసిన హీరో వరుణ్ తేజ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2024, 7:42 PM IST
Hero Varun Tej Launched Poster of Matka Movie in Vizianagaram : విజయనగరంలో ప్రముఖ హీరో వరుణ్ తేజ్ సందడి చేశారు. ఆయన నటించిన మట్కా సినిమాకు సంబంధించిన పోస్టర్ ను ఆదిత్య థియేటర్ లో విడుదల చేశారు. అంతకు ముందు వరుణ్ విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం వరుణ్ తేజ్ మాట్లాడుతూ "విజయనగరం రావడం చాలా ఆనందంగా ఉంది. మట్కా సినిమా ప్రాపర్ కమర్షియల్ మాస్ ఫిలిం. గద్దల కొండ గణేశ్ తర్వాత మాస్ సినిమాతో జనాల్లోకి వస్తున్నా. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది" అన్నారు. వరుణ్ రాకతో అభిమానులు పెద్దఎత్తున ఆదిత్య థియేటర్ వద్దకు చేరుకున్నారు. థియేటర్ పరిసర ప్రాంతాలు మొత్తం సందడిగా మారాయి. హీరో వరుణ్ తేజ్‌తో సెల్ఫీలు దిగటానికి అభిమానులు పోటీపడ్డారు.
వరుణ్ తేజ్ మొదటి సినిమా ముకుంద నుంచి ఆపరేషన్ వాలెంటైన్ వరకు ప్రతీ సినిమాలో కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం మట్కా సినిమాతో మరో కొత్త కాన్సెప్ట్‌తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్‌లు విడుదల అయ్యాయి.