బాలింత కష్టంపై స్పందించిన ప్రభుత్వం - రూ.70 లక్షలతో రోప్ వే బ్రిడ్జ్ మంజూరు - Govt Response to Pregnant Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2024, 10:34 PM IST
Govt Response to Pregnant Video in Alluri District: అల్లూరి జిల్లాలో ఇటీవల ఓ బాలింత అతి కష్టంపై వాగు దాడిన ఘటనపై ప్రభుత్వం స్పందించింది. బాలింతను ఆమె కుటుంబసభ్యులు భుజంపై మోస్తూ పెద్దేరు వాగు దాటించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో గిరిజనశాఖ మంత్రి సంధ్యారాణి స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే, అధికారులతో మాట్లాడిన మంత్రి సంధ్యారాణి వాగు దాటేందుకు రోప్‌వే బ్రిడ్జ్ మంజూరు చేశారు. రూ.70 లక్షలతో త్వరలో రోప్ వే బ్రిడ్జ్ పనులు ప్రారంభం కానున్నాయి. మంత్రి సంధ్యారాణి నిర్ణయంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ జరిగింది: అడ్డతీగల మండలం పింజర్ల కొండ గ్రామానికి చెందిన జ్యోతిక కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఆసుపత్రిలో బిడ్డను జన్మనిచ్చారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చే క్రమంలో భారీ వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పెద్దేరు చెక్‌డ్యాం పైనుంచి ప్రమాకర పరిస్థితుల్లో బాలింతను ఆమె కుటుంబసభ్యులు భుజంపై మోసుకుంటూ దాటారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామానికి చేరడానికి తప్పనిసరిగా ఈ ప్రమాదకర వాగును దాటాల్సి వస్తుందని గ్రామస్థులు వాపోతున్నారు.