మత్స్యకారుడి ఆత్మహత్య - పోలీసుల వేధింపులే కారణమా? - Police harassment in Palnadu
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 28, 2024, 5:01 PM IST
Fisherman Commits Suicide Due to Police Harassment: రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూనే అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నారు. తాజాగా పోలీసులు వేధింపులు ఓ మత్స్యకారుని నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఎస్సై వేధింపులు తాళలేక మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని బంగారుపెంట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండలం బంగారు పెంట గ్రామంలో దుర్గారావు (40) అనే మత్స్యకారుడు కృష్ణా నదిలో చేపలు వేటాడుతూ జీవనం సాగించేవాడు.
ఇటీవల పలు విషయాలను సాకుగా చూపిస్తూ అక్రమ కేసులు పెట్టి ఎస్ఐ శ్రీ హరి గత కొన్ని రోజులుగా తీవ్రంగా వేధింపులకు గురి చేశాడని మత్స్యకారులు వాపోతున్నారు. దీంతో మనస్తాపానికి గురైన బాధితుడు ఆదివారం తెల్లవారుజామున చేపలకు ఎరవేసే తాడు మెడకు చుట్టుకొని నీళ్లలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దుర్గారావు మృతికి పోలీసుల వేధింపులే కారణమని, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.