సమయమివ్వాలి - అప్పుడే గగ్గోలు పెట్టడం సరికాదు: కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి - Kethireddy Interesting Comments
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 1, 2024, 11:35 AM IST
Kethireddy Interesting Comments : వైఎస్సార్సీపీ నేత, ధర్మవం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక్రటామిరెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కూటమి సర్కార్కు సమయం ఇవ్వాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలలైనా కాకముందే పథకాలు ఇవ్వడం లేదంటూ గగ్గోలు పెట్టడం సరికాదని చెప్పారు. ఈ తక్కువ సమయంలోనే అద్భుతాలు జరిగిపోతాయని భావించడం మూర్ఖత్వం అవుతుందని పేర్కొన్నారు. సంపదను సృష్టించి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారని వివరించారు. అందుకోసం కనీసం ఒక ఆర్థిక సంవత్సరమైనా వేచి చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేతిరెడ్డి తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియోను విడుదల చేశారు.
Kethireddy on NDA Govt in AP : ఈ క్రమంలోనే సొంత పార్టీపై కేతిరెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. ఇసుక, మద్యం విక్రయాలు చేయడం వల్లే తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందన్నారు. అన్ని పథకాల్నీ అమలు చేసినా వైఎస్సార్సీపీకి 11 సీట్లే వచ్చాయని పేర్కొన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని జగన్ పదేపదే చెప్పడంతో మిగతా వర్గాలు ఆయనకు దూరమయ్యాయని తెలిపారు. తాను ప్రజల్లో ఎక్కువగా తిరిగానని, జనం దగ్గరికి తానే వెళ్లి పనులు చేసినా నిందలు, ఓటమి తప్ప ఏమీ మిగల్లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.