Konaseema Coconut Products : దేశంలో కొబ్బరి సాగులో కోనసీమ ప్రత్యేకతే వేరు. దక్షిణాది రాష్ట్రాల పోటీని తట్టుకొని ఉత్పత్తిలో కీలక స్థానంతోపాటు మార్కెట్‌తో లక్షలాదిమందికి ఉపాధి చూపుతోంది. దేశ వ్యాప్త అవసరాలకు కొబ్బరికాయలకు డిమాండ్ వచ్చినప్పుడు ఇటువైపే చూడటాన్ని బట్టి కోనసీమ ప్రాధాన్యాన్ని చెప్పొచ్చు. అయితే ఈ పంట ఆధారిత ఉప ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటుకాకపోవడం వెలితిగా ఉంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ తరహా పరిశ్రమలతో అనేకమంది యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు.
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి ఆధారిత గ్రామీణ కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ముడిసరకు సులువుగా లభ్యమవుతున్నందున అన్నదాతలు పండించిన పంటకు ఆధిక ఆదాయం సమకూరే అవకాశముంది. ఆహార ఉత్పత్తులు తయారుచేసి మార్కెటింగ్ చేయడానికి అన్ని మార్గాలు ఉన్నాయి. పోషకాలు మెండుగా ఉండే కొబ్బరి నీటిని నిల్వ చేసే పరిశ్రమల దిశగా ఆలోచించినా ఇప్పటివరకు ఏర్పాటుచేయలేదు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో నీరా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొబ్బరిపాలు, తినుబండారాలు, బిస్కెట్‌లు, వెనిగర్, అలంకరణ వస్తువుల తయారీతోపాటు పీచు, తాళ్ల పరిశ్రమలతో ఈ ప్రాంత దశనే మార్చొచ్చు.
ఏయే పరిశ్రమలకు ఆస్కారముందంటే :
- కొబ్బరినూనెను వంటనూనెగా అనేకచోట్ల వినియోగిస్తున్నారు. కురిడీ కొబ్బరి నుంచి తీసే నూనెతో దేశ వ్యాప్తంగా మార్కెటింగ్ చేసేలా యూనిట్లు అవసరం. ముందుకొచ్చే గ్రామీణ యువతకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించాలి.
- పచ్చికొబ్బరి నుంచి సేకరించే ఆయిల్, ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే ఎండు కొబ్బరి పొడికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.
- మిఠాయి(స్వీట్), కొబ్బరిపాలతో వివిధ పానీయాలు, లడ్డూ, చిప్స్, ముంజు, కొబ్బరికారం, జున్ను కొబ్బరి తదితర పరిశ్రమలు గ్రామీణ స్థాయిలో ఏర్పాటుచేసేందుకు అనుకూలంగా ఉంది. వీటిపై అవగాహన, శిక్షణ, ఆర్థిక సాయం అందిస్తే చాలు.
- కొబ్బరికాండ, చిప్పల నుంచి అలంకరణ వస్తువులు తయారు చేయొచ్చు.
- కొబ్బరిపీచు, తాడు, ఇటుకల తయారీ యూనిట్లు స్థాపించేందుకు యువతకు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా సర్కార్ చొరవ చూపాల్సి ఉంది.
![Konaseema Coconut Products](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/23499893_konaseema-coconut-products.png)
మామిడికుదురు, మలికిపురంలో పరిశ్రమలకు ప్రతిపాదనలు : కోనసీమలో కొబ్బరిపంటను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఇటీవల ఈ ప్రాంతంలో ఏయే ఉప ఉత్పత్తుల పరిశ్రమలను స్థాపించవచ్చనే దానిపై విధానాలు రూపొందించిందని జిల్లా పరిశ్రమల కేంద్రం సహాయ సంచాలకుడు పి.శివరామప్రసాద్ పేర్కొన్నారు. ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. అలానే మామిడికుదురు మండలం పెదపట్టణం లంకలో విలువ ఆధారిత ఉత్పత్తుల క్లస్టర్‌ను రూ.10 కోట్లతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. ఇది పురోగతిలో ఉందన్నారు. మలికిపురంలో కొబ్బరినీరు తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు యోచిస్తున్నామని ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆర్.మహేశ్‌కుమార్ ముందు ఉంచినట్లు ఆయన వివరించారు.
Six Branches to Coconut Tree: ఈ వింత చూశారా.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు