నిర్లక్ష్యం వీడని విద్యుత్ అధికారులు - పొంచి ఉన్న ప్రమాదం - ap Electricity Officials Negligence
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 25, 2024, 5:29 PM IST
Electricity Department Officials Negligence : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ శాఖ అధికారులు ఇంకా అదే ప్రవర్తనను కొనసాగిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఎస్టీ కాలనీలో జూన్ 23న హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడి ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనతో స్థానిక ప్రజలు అప్రమత్రం అయ్యారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ విద్యుత్ శాఖ అధికారులు మాత్రం 'నిమ్మకు నీరెత్తినట్లు' వ్యవహరిస్తున్నారు. విద్యుత్ షాక్ నుంచి ప్రజలను కాపాడకుండా కాలయాపన చేస్తున్నారు.
కనిగిరిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరి కూలే స్థితికి చేరాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ తీగలు వేలాడుతూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేసినా ఆ తర్వాత మాత్రం విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక ప్రమాదాలు జరిగినా అధికారుల్లో చలనం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.