బడిలోనూ దాహం కేకలు - గొంతు తడవక వృద్ధుల అవస్థలు - DRINKING WATER SCARCITY IN KANIGIRI - DRINKING WATER SCARCITY IN KANIGIRI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 22, 2024, 4:32 PM IST
Drinking Water Scarcity in Kanigiri Mandal : గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు లేక ప్రకాశం జిల్లా కనిగిరి (Kanigiri) మండల ప్రజలు అల్లాడుతున్నారు. చాకిరాల ప్రాథమిక ఉన్నత పాఠశాలతో పాటు పంచాయతీలోని రామిరెడ్డిపల్లి, గుత్తిపాలెం, తురకపల్లి గ్రామస్థులు మంచినీటి కోసం అవస్థలు పడుతున్నారు. పైపులైన్ల ద్వారా వచ్చే సాగర్ నీటిని అకారణంగా 15 రోజులపాటు నిలిపి వేయడంతో తాగునీరు (Drinking Water) లేక నానా అవస్థలు పడుతున్నామని వృద్ధులు వాపోతున్నారు. నీటి సరఫరా లేకపోవడంతో పాఠశాలలో ఉన్న ఆర్వో ప్లాంట్ మూలన పడింది. దీంతో పిల్లలు ఇంటి వద్ద నుంచే నీళ్ల బాటిళ్లను తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపరించింది. ఓ వైపు ప్రజలు దాహం కేకలతో అల్లాడుతుంటే అధికార నేతలు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
త్రాగేందుకు నీళ్లు లేక గ్రామస్థులు సుమారు ఐదు కిలోమీటర్ల మేర వెళ్లి నీటిని తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కనీస అవసరాలకు సమీప పొలాల్లో ఉన్న వ్యవసాయ బోర్ల వద్ద కొందరు నీటిని తెచ్చుకుంటుండగా మరికొందరు ఆయా వ్యవసాయ బోర్ల వద్ద నుంచి సొంత ఖర్చులతో పైపులైన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వేసవి (Summer) దృష్టిలో ఉంచుకుని కనీసం తాగేందుకైనా మంచి నీటిని సకాలంలో అందించి తమ ప్రాణాలను కాపాడాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.