జగన్ పర్యటనతో ప్రజల ఇక్కట్లు- రహదారి మధ్యలో బారికేడ్లు ఏర్పాటు - సీఎం జగన్మోహన్ రెడ్డి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 9:35 AM IST
CM Jaganmohan Reddy Will Visit Kurnool Today: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కర్నూలులో పర్యటించనున్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనవడి వివాహ వేడుకలకు సీఎం జగన్ హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ కర్నూలు ఎయిర్ పోర్టుకు వెళతారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కింగ్ ప్యాలెస్ కళ్యాణ మండపానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ వస్తున్నారని చెట్లపై గొడ్డలి వేటు వేశారు. వేలాది ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
వివాహ ప్రాంగణం నుంచి 900 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ప్రాంగణం వరకు రాష్ట్ర రహదారి మధ్య బారికేడ్లను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం జగన్ వస్తున్నారని కర్నూలు నుంచి కోడుమూరు, పత్తికొండ, బళ్లారి, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే వేలాది వాహనాలకు వెళ్లడానికి వీలులేకుండా బారికేడ్లు పెట్టేశారు. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు తలెత్తాయి.