బీజేపీ 'పల్లెకు పోదాం'- ఈ నెల 12 నుంచి 21 వేల గ్రామాల్లో పర్యటన - పల్లెకు పోదాం కార్యక్రమం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 1:45 PM IST
BJP Purandeswari on Palleku Podam Program: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 12 నుంచి 'పల్లెకు పోదాం' పేరిట 21 వేల గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు పర్యటించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాజకీయంగాను పార్టీ కార్యక్రమాలు విస్తరించే దిశగానే గ్రామాల్లో 24 గంటల పాటు బీజేపీ కార్యకర్తలు పర్యటించి- స్థానికంగా అక్కడే ఉండి పరిస్థితులను కూలంకుషంగా పరిశీలించి నివేదికలు అందజేయాలని సూచించినట్లు చెప్పారు. వీటన్నింటినీ క్రోడీకరించి పార్టీ జాతీయ నాయకత్వానికి అందిస్తామని తెలిపారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రణాళికలు ఉంటాయని అన్నారు.
"సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాజకీయంగాను పార్టీ కార్యక్రమాలు విస్తరించే దిశగా 'పల్లెకు పోదాం' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 12 నుంచి రాష్ట్రంలో ఉన్న 21 వేల గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు పర్యటించనున్నారు. గ్రామాల్లో 24 గంటల పాటు బీజేపీ కార్యకర్తలు పర్యటించి- స్థానికంగా అక్కడే ఉండి పరిస్థితులను కూలంకుషంగా పరిశీలించనున్నారు." - దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు