సిద్ధం సభలో ఏబీఎన్ ఫోటోగ్రాఫర్పై దాడి హేయం : టీడీపీ - సిద్ధం సభలో జర్నలిస్టుపై దాడి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 10:34 AM IST
Attack on ABN Photographer: అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన జగన్ సిద్ధం సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై జరిగిన దాడిని తెలుగుదేశం నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రౌడి రాజ్యం పాలన సాగిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ఒక పత్రికకు, ఓ ఛానల్‌కు యజమాని అయి ఉండి, జగన్ ఇటువంటి దాడులు ప్రోత్సహించడం హేయమని నారా లోకేశ్ మండిపడ్డారు.
సిద్ధం సభలో ఫొటోలు తీయడం నిషిద్ధమా?, నేరమా? అని ప్రశ్నించారు. జగన్ సభలకు ఆయన కూలి మీడియా, నీలి మీడియా తప్ప ఎవరూ వెళ్లకూడదా? అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతల దాడిలో గాయపడిన ఫొటోగ్రాఫర్ కృష్ణను టీడీపీ నేతలు కాలువ శ్రీనివాసులు, సూర్యనారాయణ, పరిటాల శ్రీరామ్ పరామర్శించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీరామ్ డిమాండ్ చేశారు.