ప్రభుత్వం ఇచ్చిన పదోన్నతి ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 19, 2024, 9:31 AM IST
AP High Court on Promotion of Lecturers as Principals: ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 197 మంది లెక్చరర్లకు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్ విద్యా కమిషనర్ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రిన్సిపల్ పోస్టుల పదోన్నతిలో లైబ్రరీ సైన్స్ చేసిన జూనియర్ లెక్చరర్లను పరిగణనలోకి తీసుకోక పోవడాన్ని ప్రాథమికంగా తప్పుపట్టింది. వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం 2021లో ప్రభుత్వం జారీచేసిన జీవో 76కి విరుద్ధమని తెలిపింది. పూర్తివివరాలతో కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశించింది. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఇంటర్ విద్యా కమిషనర్, సాధారణ పరిపాలనశాఖ సీఎస్‌కు నోటీసులు జారీచేసింది.
ప్రిన్సిపల్స్ పదోన్నతిలో తమను పరిగణనలోకి తీసుకోకపోవడం వివిధ జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ ఈ నెల 15న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా పదోన్నతి కల్పించారంటూ వారి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. లైబ్రరీ సైన్స్ చేసిన పిటిషనర్లను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి 197 మందికి ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్ చేశారు. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేశారు.