పాఠశాల వార్డెన్ గదిలో కళ్లు చెదిరేలా గుట్కా, మద్యం బాటిల్స్- వెలుగులోకి వచ్చింది ఇలా - Drugs in Sansid school
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 28, 2024, 10:43 PM IST
Alcohol Bottles and Gutka in Private School: అనంతపురం రూరల్ సమీపంలో ఉన్న ఓ పాఠశాలలో మద్యం బాటిల్స్, గుట్కా కలకలం రేపాయి. ప్రైవేటు పాఠశాలలో విజయ్ అనే హాస్టల్ వార్డెన్ విద్యార్థులను నిత్యం చితకబాడేవాడు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో పాఠశాల వద్దకు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో హాస్టల్ వార్డెన్ విజయ్ అక్కడి నుంచి పరారయ్యాడు. విజయ్ గదిలో విద్యార్థుల తల్లిదండ్రులు పరిశీలించగా పెద్ద ఎత్తున మద్యం బాటిల్లు, గుట్కా ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. పాఠశాలలో ఇలాంటి వ్యక్తిని ఎలా ఉంచారని పాఠశాల యాజమాన్యాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పాఠశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హాస్టల్ వార్డెన్గా ఉంటూ నిత్యం మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదుతున్న వ్యక్తిపై యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. 30 నుంచి 40 మంది విద్యార్థులు తీవ్ర గాయాలతో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలపై క్రిమినల్ కేసును నమోదు చేయాలన్నారు.