Flooded bike repair :విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లోని బాధితులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిపోయారు. వేలాది ఇళ్లు మొదటి అంతస్తు వరకూ నీళ్లు రావటంతో సామగ్రి వరదలో కొట్టుకుపోయింది. ఇళ్ల బయట నిలిపి ఉంచిన వాహనాలు వరదనీటిలోనే ఉండిపోయాయి. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిన అనంతరం వాటిని పునః వినియోగం కోసం బాధితులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మునిగిపోయిన లక్షలాది వాహనాల విషయంలో ఏం చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లు, ఇన్సూరెన్సు కంపెనీలతో సంప్రదింపులు చేస్తోంది. అయితే స్వల్ప మరమ్మతుతోనే వాటిని పునః వినియోగం చేసుకునే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనదారులకు పెద్దగా ఇబ్బందేమీ ఉండదని భరోసా ఇస్తున్నారు. వాహన తయారీ సంస్థలు ఇప్పటికే ముంపులో పాడైన వాహనాల రిపేర్, బీమా విషయంలో కొంత వెసులుబాటు కల్పించినట్టు తెలుస్తోంది.
వాహనం వరదలో మునిగిపోతే కంగారు పడాల్సిన పనిలేదని విజయవాడకు చెందిన బైక్ టెక్నీషిన్ అలేఖ్య భరోసా ఇస్తున్నారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహన యజమానులకు పలు సూచనలు చేశారు.
- ఇంజిన్ మునిగిపోతే తప్ప షోరూమ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.
- పార్ట్స్ మార్పించాల్సిన అవసరం లేదు.
- ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ మార్చుకుంటే సరిపోతుంది.
- వీటికి బైక్ మోడల్ ను బట్టి 3వేల ఖర్చు మించదు.
- ఒక వేళ ఇంజిన్ మునిగిపోయినట్లయితే షోరూమ్ కు తీసుకెళ్లాలనే ఆలోచనతో బండిని స్టార్ట్ చేయొద్దు.
- బండిని స్టార్ట్ చేసి రన్ చేస్తే ఇంజిన్ బోర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
- బండి స్టార్ట్ చేసుకుని వెళ్తే ఇంజిన్లోకి నీళ్లు వెళ్లి దాదాపు 15నుంచి 20వేలకు పైగా ఖర్చవుతుంది.
- పెట్రోల్ ట్యాంకు సహా వరదలో మునిగిపోతే బడ్జెట్ ఎక్కువే అవుతుంది. ఇంజిన్ వరకే మునిగితే సేఫ్ జోన్లో ఉన్నట్లే.
- కొత్త వాహనాలకు వారంటీ ఉంటుంది కాబట్టి ఆందోళన అక్కర్లేదు.
- వారంటీలో షోరూమ్ వాళ్లే రిపేర్ చేసే అవకాశాలున్నాయి.
- తక్కువ ఖర్చులో రిపేర్ పూర్తి కావాలంటే వారంటీ ఉంటే సరిపోతుంది.
- కొన్ని వాహనాలకు ఇన్స్యూరెన్స్ కూడా వర్తిస్తుంది.
- కస్టమర్ చేయించుకున్న బీమాలో వరదలు, భూ కంపాల కవరేజీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.