Zero Hour Discussion in Assembly: ఏపీ శాసనసభ జీరో అవర్‌లో కీలకమైన అంశంపై చర్చ చోటు చేసుకుంది. అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ శాసనసభ్యులు డిమాండ్ చేశారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్గా మారిపోయిందని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాసు అన్నారు. గతంలో తన సతీమణి, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీతో పాటు తన కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేశారని ఆక్షేపించారు. దీనిపై మాజీ శానసభా స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు.
చట్టబద్దత లేని చట్టాన్ని అమలు చేసేలా దిశ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసి అదే మహిళా పోలీసు స్టేషన్లో ఓ శాసన సభ్యురాలిపైనే తొలికేసు నమోదు చేయించారని ఆరోపించారు. మహిళ రక్షణ కోసం రూపొందించిన దిశ యాప్ను పురుషుల మొబైళ్లలోనూ డౌన్ లోడ్ చేయించారని అన్నారు. అమల్లో లేని దిశ చట్టానికి, పోలీసు స్టేషన్లకు నిధులు కేటాయించటంపై విచారణ చేయించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ అభ్యర్ధించారు.
మరోవైపు సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టి అరెస్టైన వారు బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ కొనసాగిస్తున్నారని మరో ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. జగన్ జిల్లాకు ఓ ఇన్ఛార్జిని పెట్టి సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టించేలా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులపై మాటల్లో కాదని చేతల్లో చూపించాలన్నారు.