YSRCP Violates Election code in Tirupati: పావలా ఖర్చు చేసి రూపాయి ప్రచారం చేసుకోవడంలో ఆయన దిట్ట. ఆ పావలా కూడా ప్రభుత్వ సొమ్మే ఖర్చు చేసి సొంత ప్రయోజనాలకు ప్రచారం చేసుకుంటారు. అలాంటిది 2 కోట్ల రూపాయలు పెట్టి చేపట్టిన ప్రాజెక్ట్, అది కూడా దేశంలోనే అత్యంత పెద్ద జాతీయ జెండా స్థూపం నిర్మాణాన్ని గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. ఈ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. పైగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా చకచకా పనులు చేస్తున్నారు.
ఎలాంటి ప్రచారం లేకుండానే: యువతలో జాతీయస్ఫూర్తి నింపడంతోపాటు, దేశం పట్ల అభిమానం పెంపొందేలా వారిలో ప్రేరణ కలిగించడమే లక్ష్యంగా తిరుపతి శివారులోని తుమ్మలకుంటలో దేశంలోనే అత్యంత ఎత్తైన జాతీయజెండా నిర్మాణం చేపట్టారు. యువతలో ప్రేరణ కలిగించడానికి చేపట్టిన ప్రాజెక్ట్‌ను మాత్రం ఎవరికీ చెప్పకుండా, ఎలాంటి ప్రచారం లేకుండా, గుట్టుచప్పుడు కాకుండా చేపట్టడం వెనక ఆంతర్యమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. విమానాశ్రయానికి సమీపంలో ఏదైనా ఎత్తైన నిర్మాణాలు చేపట్టాలంటే కచ్చితంగా పౌరవిమానయాన సంస్థ అనుమతి తీసుకోవాల్సిందే. కానీ ఎలాంటి అనుమతి లేకుండా అధికార పార్టీ నేత అండదండలతో చకచకా పనులు చేస్తున్నారు.
జెండా ఎగురవేయడానికి వీలుగా: తుమ్మలకుంట చెరువును క్రీడా మైదానంగా మార్చడంపై ఇప్పటికే జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో విచారణ సాగుతోంది. ఇప్పుడు అదే ప్రదేశంలో అత్యంత ఎత్తులో జాతీయ జెండా ఎగురవేయడానికి స్థూపం నిర్మిస్తున్నారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నిధులు రెండున్నర కోట్లు వెచ్చించి ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. జాతీయ జెండా ఎగుర వేయడానికి వీలుగా నిర్మాణాలు చేపట్టేలా తుడా బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకొని టెండర్లు పిలిచారు. ఎత్తైన స్థూపం నిర్మించడానికి అవసరమైన అనుమతులు లేకపోయినా, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణాలు ప్రారంభించారు.