YCP Coverts on Police Department : పోలీసుశాఖలో వైఎస్సార్సీపీ కోవర్టులు ఉండడంతోనే ఆ పార్టీ పులివెందులకు చెందిన సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి పరారైనట్లు పోలీసు ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వర్రాను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు నాటకాలు ఆడడం, 41-ఏ నోటీసులిచ్చి రాచమర్యాదలతో సాగనంపడం వంటి విషయాలని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కొందరు పోలీసు అధికారులు వైఎస్సార్సీపీకు కోవర్టులుగా వ్యవహరిస్తున్నట్లుగా అంచనాకు వచ్చారు. ఈ మేరకు కోవర్టులు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
వర్రా పరారయ్యేందుకు పక్క ప్లాన్ : వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నిందితుడిని అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీసులు వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ తాత్సారంతో వదిలేసినట్లుగా విచారణలో తేలింది. కడప చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ సీఐ తేజోమూర్తికి సంబంధం లేనప్పటికీ రవీందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకోవటం కోసం ఆయన్ను వినియోగించారు. వేముల- వేంపల్లె మధ్య రవీందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని తాలూకా పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత తేజోమూర్తి తెరవెనుక ఉండి తాలూకా సీఐ వెంకటేశ్వర్లు ద్వారా వ్యవహారం నడిపినట్లుగా తేలింది. తేజోమూర్తితో పాటు తాలూకా, రాజంపేట పోలీసులతో పాటు ఎస్బీ మాజీ సీఐగా ఉన్న వ్యక్తి రంగప్రవేశం చేసి వర్రా పరారయ్యేవిధంగా ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఈ అనుమానంతోనే కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ బుధవారం రాజంపేట, రాయచోటి ప్రాంతాల్లో పర్యటించి సమీక్షించారు. కడపతో పాటు రాజంపేట, బద్వేలు, చిట్వేలిలోని కొందరు పోలీసు అధికారుల తీరుపైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి.
- వర్రా రవీందర్‌రెడ్డిపై కడప, రాజంపేట, మంగళగిరి, హైదరాబాద్‌లలో పలు కేసులున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసులు పట్టించుకోకుండా తాజాగా అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకునే పక్షంలో వరుస కేసులతో జైలు పాలు కావాల్సిన రవీందర్‌రెడ్డి చివరికి పరారయ్యారు. అనంతరం వెంబడించగా 567 నంబరు గల వాహనం ఖాజీపేట టోల్‌గేటు దాటినట్లు గుర్తించారు. ఆ వాహనాన్ని వెంబడించినా అందులో లేకుండా మరో వాహనంలో పారిపోయినట్లు సమాచారం. పులివెందుల మీదుగా బెంగళూరు వెళ్లిపోయినట్లు అంచనాకు వచ్చిన పోలీసులు ఆ మేరకు గాలింపు చర్యలు చేపట్టారు.
- రాష్ట్ర ప్రభుత్వం రవీందర్‌రెడ్డి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అదనపు ఎస్పీ ప్రకాశ్‌బాబు నేతృత్వంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే బృందాలు వేర్వేరుగా పలు ప్రాంతాలకు వెళ్లాయి. వర్రా వినియోగించే రెండు చరవాణులు స్విచ్ఛాప్ చేయడంతో పాటు తన వద్ద లేకుండా జాగ్రత్తలు పడినట్లు పోలీసులు గుర్తించారు. తద్వారా సిగ్నల్ ద్వారా తనను గుర్తించకుండా జాగ్రత్తలు పడినట్లు భావిస్తున్నారు. అందుబాటులో ఉన్న నిందితుడిని పక్కా ప్రణాళికతో పోలీసులు వదిలేయడం, అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రభుత్వాన్ని నమ్మించే ప్రయత్నాలు జరిగాయనే అంచనాకు వచ్చారు.