YSRCP Social Media Activist Varra Ravinder Reddy Case : అధికార పార్టీ ముఖ్యనేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను విచారించడానికి కడప పోలీసుశాఖ సిద్ధమవుతోంది. వర్రా రవీందర్‌రెడ్డి అరెస్ట్‌తో వెలుగుచూసిన ఆ పార్టీ కార్యకర్తలకు 41-A నోటీసులు ఇవ్వనున్నారు. ఇప్పటికే జిల్లాలో పలువురికి నోటీసులు ఇచ్చారు. వర్రా రవీందర్ రెడ్డి వద్ద నుంచి సీజ్ చేసిన సోషల్ మీడియా పేజీల వారీగా కార్యకర్తలకు నోటీసులు ఇవ్వనున్నారు. అదే సమయంలో వర్రా రవీందర్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతోంది.
వైఎస్సార్సీపీ కార్యకర్తల గుండెల్లో గుబులు :ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్‌తో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నెల 8న వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఐటీ యాక్టు, బీఎన్ఎస్ (BNS) యాక్టు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద పోలీసులు వివిధ సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేశారు. వర్రా రవీందర్‌రెడ్డిపై నందలూరు పోలీస్ స్టేషన్‌లో మరో అట్రాసిటీ కేసు నమోదైంది. జిల్లాలోని రాజంపేట, కడప తాలూకా, చిన్నచౌకు, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో 10 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇతనిపై 40 వరకు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. వర్రా వాంగ్మూలం ఆధారంగా 45 మంది వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తలపై కేసులు పెట్టి విచారించేందుకు సిద్ధమవుతున్నారు.
అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఎక్కడ? - జల్లెడ పడుతున్న పులివెందుల పోలీసులు
పలువురికి నోటీసులు జారీ : 2012లో వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ రాష్ట్ర కోఆర్డినేటర్ గుర్రంపాటి దేవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో పనిచేసిన కొందరు సామాజిక మాధ్యమ కార్యకర్తలను పోలీసులు గుర్తించారు. 2019లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపట్టిన ఐ డ్రీం ఛానల్ ఛైర్మన్ చిన్న వాసుదేవరెడ్డి ఏపీ డిజిటల్ మీడియా కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టి వైఎస్సార్సీపీ సోషియల్ మీడియాకు పనిచేశారు. వారి 65 మంది టీమ్‌లో కీలకంగా పనిచేసిన 12 మంది పార్టీ కార్యకర్తల పేర్లను సేకరించారు. అదే విధంగా 2022లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపట్టిన సజ్జల భార్గవ్ రెడ్డి హయంలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి, ఫొటోలు మార్ఫింగ్ చేసే మరికొందరు కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.