YSRCP Neglected Rehabilitation Centre for Physically Challenged Persons :దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగా ఉపాధి పొందేందుకు వీలుగా 2018కి ముందు టీడీపీ హయాంలో పలు జిల్లాలో దివ్యాంగుల పునరావాస కేంద్రాలు ఉండేవి. అక్కడ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు వారి స్వయం ఉపాధికి బాటలు వేశాయి. 2015లో టీడీపీ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల కేంద్రంగా జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. డీఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వందలాది మంది ఈ పునరావాస కేంద్రంలో శిక్షణ తీసుకొని అనేక సంస్థలలో ఉపాధి పొందారు. అయితే 2019 తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పునరావాస కేంద్రం నిర్వహణను గాలికొదిలేసింది.
కొన్నేళ్ల కు అక్కడ వసతి, పరిసరాలు దివ్యాంగులకు అనుగుణంగా లేకపోవడంతో శిక్షణకు ఎవరు ముందుకు రాలేదు, ఏళ్లు గడుస్తున్నా కొద్దీ సిబ్బంది పర్యవేక్షణ కొరవడంతో పూర్తి స్థాయిలో భవనం శిథిలావస్థకు చేరింది. ప్రాంగణమంతా పెద్ద ఎత్తున పిచ్చి మొక్కలు మొలిచాయి. ఇప్పుడు అది అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రధాన రహదారికి పక్కనే ఉన్నా అటువైపు వెళ్లాలంటేనే స్థానికులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు దివ్యాంగులు. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 32 వేల మంది దివ్యాంగులు ఉండగా వారి కోసం కనీసం ఒక సామాజిక భవనం కేటాయించి పునరావాస కేంద్రం ఏర్పాటు చెయ్యలేదని ధ్వజమెత్తారు.