Vijayasai Reddy Quits Politics : రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ఆది నుంచి అరాచకమే. ఆడిటర్‌గా ఆర్థిక నేరాల్లో ఆరితేరి తర్వాత రాజకీయాల్లోనూ దానినే కొనసాగించారు. వైఎస్ కుటుంబం అక్రమాస్తులను కూడబెట్టడంలో ఆడిటర్‌గా దన్నుగా నిలిచారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు రప్పించడంలో, పారిశ్రామికవేత్తలను భయపెట్టడం, బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడంలో కీలకభూమిక పోషించిన ఘనాపాఠి. వైఎస్ రాజారెడ్డి, తర్వాత రాజశేఖర్‌రెడ్డి, ఆపైన జగన్. ఇలా వైఎస్ కుటుంబంలో మూడు తరాలతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా విజయసాయిరెడ్డి ఆర్థిక అక్రమ బంధం కొనసాగుతూ వచ్చింది.
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో సూత్రధారి, కీలకపాత్రధారి విజయసాయిరెడ్డి. సూట్‌కేస్ కంపెనీల ఏర్పాటులో, వాటి ద్వారా నిధులు మళ్లించడంలో, జగతి పబ్లికేషన్ విలువను అమాంతం పెంచుతూ డెలాయిట్ నుంచి తప్పుడు నివేదికలు తీసుకువచ్చి, ఆ సంస్థ షేర్ విలువను భారీగా పెంచి జగన్‌కు మేలు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి వారితో జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టించారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల అక్రమాల్లో జగన్ ఆత్మగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయనతో పాటే ఏడాదిపైగా జైలులో గడిపారు.
పాపాల్లో పాలు - అందుకే పదవులు : అక్రమాస్తుల వ్యవహారంలో తనకు పూర్తిస్థాయిలో సహకరించినందుకు ప్రతిఫలంగా వైఎస్ జగన్ విజయసాయిరెడ్డికి 2016లో వైఎస్సార్సీపీ తరపున రాజ్యసభకు పంపారు. ఆ పార్టీ ఏర్పాటయ్యాక వచ్చిన తొలి రాజ్యసభ స్థానమది. పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా అవకాశం కల్పించడంతో ఆయన ఆ హోదాలో కేంద్రంలో విస్తృతంగా లాబీయింగ్ చేసి జగన్‌కు వ్యక్తిగతంగా, రాజకీయంగా మద్దతు కూడగట్టారు. జగన్ అక్రమాస్తుల కేసులో దాదాపు 12 ఏళ్ల నుంచి ఎలాంటి పురోగతి లేకపోవడం ఇక్కడ గమనార్హం. 2022లో రెండోసారి కూడా రాజ్యసభ అవకాశమిచ్చారు. 2028 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు పదవీకాలం ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో వైఎస్సార్సీపీ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.
సీబీఐ, ఈడీలు జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డిని ఎ-2గా చేర్చాయి. అప్పటి నుంచి ఆయన ఎ-2గా పేరొందారు. వైఎస్సార్సీపీలో జగన్ తర్వాత దాదాపు నంబర్-2గా వ్యవహరించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఆయన విశాఖ కేంద్రంగా సాగించిన ఆ రాజకీయం వేరే లెవెల్. ఆ ప్రాంతానికి తానే ముఖ్యమంత్రిననే స్థాయిలో అప్పట్లో రెచ్చిపోయారు.